కాచిగూడ, అక్టోబర్ 17: తెలంగాణ ప్రభుత్వం మున్నూరు కాపులకు అండగా ఉంటుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎం.ఆర్.వెంకట్రావు అధ్యక్షతన తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ బారినపడి మరణించిన ప్రజలు, తల్లిదండ్రులను కోల్పోయిన 330 మంది విద్యార్థులకు రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని మేయర్ విజయలక్ష్మి కాచిగూడలోని మున్నూరు కాపు సంఘంలో ఆదివారం అందజేశారు. ముఖ్య అతిథిగా మేయర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలోని మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె పేర్కొన్నారు. అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులు రాజకీయంగా మరింతగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. కార్యక్రమంలో పురానాపూల్ కార్పొరేటర్ రాజ్‌మోహన్, ట్రస్టీలు గంప చంద్రమోహన్, ఆకుల పాండు రంగారావు, పన్నాల విష్ణువర్ధన్, జెల్లి సిద్దయ్య, బాల కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.