ఖైరతాబాద్, సెప్టెంబర్ 8 : గణేశ్ నవరాత్రోత్సవాలకు ఇబ్బందులు లేకుండా భారీ వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలని, పాట్ హోల్స్ (గుంతలు)ను వెంటనే పూడ్చివేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లో నిర్వహించనున్న బడా గణేశ్ నవరాత్రోత్సవాల నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. కొవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలను ఆమె ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్‌లను అడిగి తెలుసుకున్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు. అనంతరం ఖైరతాబాద్ రైల్వేగేటు, మార్కెట్ రోడ్, మారూతినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
గణేశ్ నవరాత్రోత్సవాల మూడో రోజు నుంచే విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పీవీ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్ల వద్ద క్రేన్లు ఏర్పాటు చేసే స్థలాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. విగ్రహాలను నిమజ్జనానికి తరిలించే మార్గాలు, అధికారులు చేపట్టనున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వినాయకచవితి మొదలు నిమజ్జనం వరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాలని సూచించారు. మేయర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, సర్కిల్ 17 ఉప కమిషనర్ వంశీకృష్ణ, ఏంఏవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, ఎస్ఈ రత్నాకర్, ఈఈ ఇందిర, డీఈ చైతన్య, ఏఈ చరణ్ ఉన్నారు.