సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల విస్తరించడం, దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాజేంద్రనగర్లో అత్యధికంగా 8.2సెం.మీలు వర్షపాతం నమోదవగా శనివారం రాత్రి 10.30గంటల వరకు జూబ్లీహిల్స్లో అత్యధికంగా 6.5సెం.మీల వర్షపాతం నమోదైంది.
కుండపోతగా కురిసిన వానతో ముందుగానే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకున్నారు.