సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): 70..50..30.. ఇవి సంఖ్యలే కాని లక్షలు.. బదిలీలు, పదోన్నతుల కోసం ప్రాధాన్యత స్థానాన్ని బట్టి పెట్టిన ముడుపుల లెక్కా. ఒక్కో ఫోకల్ పోస్టుకు రేటు నిర్ణయించి ఆ రేట్ ప్రకారమే ఈ బదిలీల ప్రక్రియ జరిగిందని విద్యుత్ ప్రధాన కార్యాలయంలో చర్చ జరుగుతుంది. దక్షిణ డిస్కంలో జరిగిన పదోన్నతులతో పాటు బదిలీల్లో జరిగిన అక్రమాలపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నమస్తే తెలంగాణలో వచ్చిన ఆ పోస్ట్ చాలా కాస్ట్ అనే కథనం మింట్కాంపౌండ్తో పాటు పలు విద్యుత్ సంఘాల కార్యాలయాలు, సిబ్బంది మధ్య చర్చనీయాంశమైంది.
మంత్రి పేరుతో వసూళ్లు!
తాము తీసుకునే డబ్బుల్లో శాఖ మంత్రితో పాటు ముఖ్య అధికారులకు కూడా వాటాలు ఉంటాయని వారికి ఇస్తేనే పోస్టింగులు పడుతాయంటూ కొందరు కీలక వ్యక్తులు చెప్పడంతో ఆయా స్థానాలు కోరిన వారు ముందుగానే చెల్లింపులు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు డబ్బులు చేతిలో పడ్డ తర్వాతనే హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేసి ఎక్కడా అనుమానం రాకుండా చేద్దామనుకున్నప్పటికీ నిబంధనలు అతిక్రమించి చేసిన వ్యవహారం మొదటికే మోసమయ్యేలా చేసింది.
మంత్రికి డబ్బులు ముట్టాయా లేదా అనేదానితో పాటు డిస్కం ముఖ్య అధికారులు, కొందరు కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు కూడా వాటాలు అందాయంటూ డబ్బులు ఇచ్చిన వారే తమ తోటివారితో చర్చించారని మింట్ కాంపౌండ్ ప్రధాన కార్యాలయం . చుట్టుపక్కల చర్చించుకుంటున్నారు. అధికారుల బదిలీల్లో ఎక్కడా నిబంధనలు పాటించకుండా తన నమ్మకాన్ని వమ్ము చేసిన హెచ్ఆర్ డైరెక్టర్‌పై సీఎండీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. డిస్కంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున బదిలీలు జరగగా అందులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతులు ఇచ్చేవారితో భర్తీ చేయాల్సినప్పటికీ కాసుల కోసమే అడ్డదారుల్లో బదిలీలు చేశారనే విమర్శలు ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా బదిలీలు, ప్రమోషన్లు..
బదిలీల విషయంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. ముందుగా ప్రభుత్వ పరంగా బదిలీలకు అనుమతి లేదు. ఒకేసారి ఇంతపెద్ద మొత్తంలో బదిలీలు చేశారంటే పాలనాపరమైన అనుమతులు రావాలి. కానీ ఇష్టారాజ్యంగా బదిలీలు, ప్రమోషన్లు చేపట్టారు. బదిలీ చేయాలంటే ఆ పోస్టులో అధికారి అసమర్థంగానైనా లేక ఏదైనా అక్రమాలకు పాల్పడి ఖాళీ ఏర్పడాలి. ఈ సమయంలో ఆ ఖాళీని భర్తీ చేయడానికి అనుమతి ఉంటుంది. కానీ అలా కాకుండా 200 మందిని ప్రమోషన్ల,బదిలీలు చేశారు. ఈ విషయంలో నిబంధనలకు విరుద్దంగా చాలామంది మూడేళ్ల కాలపరిమితి కాకుండానే కేవలం ఏడాది నుంచి ఏడాదిన్నరలోపే బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సెక్షన్లలో ఒక ఉద్యోగి ఉండగానే ఆయన స్థానంలో మరొకరికి పోస్టింగ్ ఇచ్చి అతడిని ఎక్కడకు పంపకపోవడంపై చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారాన్ని సరిదిద్ది సంస్థాగతంగా ఉద్యోగులను గాడిలో పెట్టాలని సీఎండీ ముషారఫ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.