బంజారాహిల్స్,డిసెంబర్ 2: ఐఏఎస్ అధికారిని అంటూ మోసాలకు పాల్పడిన బత్తిన శశికాంత్ అలియాస్ శశికిరణ్ లీలలు మరిన్నీ వెలుగులో కి వచ్చాయి. ఫిలింనగర్‌లోని అపర్ణ ఆరా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటూ ఐఏఎస్ అధికారిని అని, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎన్ఐఏ)లో పనిచేస్తున్నానంటూ నమ్మించి మోసాలకు పాల్పడిన శశికాంత్‌ను గతనెల 26న ఫిలింనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలంటూ ఫిలింనగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
పరిశ్రమల స్థాపన కోసం స్థలం కేటాయింపచేస్తానంటూ షేక్‌పేటకు చెందిన గోల్డ్ జిమ్ యజమాని అలీహసన్ను నమ్మించి రూ.10.50లక్షలు వసూలు చేసి మోసం చేసిన శశికాంత్ రెండు తెలుగురాష్ర్టాల్లో భారీ ఎత్తున మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా మణికొండ సమీపంలోని జేకే ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న కౌండిన్య విఖ్యాత్ అనే వ్యక్తితో పాటు అతడి భార్య వద్దనుంచి తక్కువ ధరకు ఫ్లాట్ ఇప్పిస్తానంటూ రూ.22లక్షలు వసూలు చేసి ముఖం చాటేసినట్లు బాధితులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఇప్పటికే మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇదే తరహా మోసాలకు పాల్పడడంతో రెండు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. కాగా.. ఏపీ, కర్నూల్లోని అశోక్‌నగర్‌లో కలర్ ల్యాబ్ నిర్వహించే ఎస్.వెంకటేశ్వర్లను మౌర్యా ఇన్ హోటల్లో పరిచయం చేసుకున్న బత్తిన శశికాంత్.. తాను ముంబైలోని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నా నని, దేశంలోని పలు ప్రాంతాల్లో తనకున్న పరిచయాలతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో తన బంధువులకు, ఉద్యోగాల కోసం రూ.15లక్షలు ఇచ్చిన వెంకటేశ్వర్లు … శశికాంత్ మోసాలు మీడియాలో చూసి రెండ్రోజుల క్రితం కర్నూల్ టూ టౌన్లో ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదయింది.
ఫిలింనగర్ పోలీసులు శశికాంత్‌ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని తెలుసుకున్న బాధితుడు వెంకటేశ్వర్లు మంగళవారం ఇక్కడకు వచ్చారు. కర్నూల్లో తనతో పాటు పలువురు బాధితులున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ సంస్థ నిర్వహించిన శశికాంత్.. అక్కడ సైతం భారీగా మోసాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తన భార్య, మరికొంతమందితో సినీ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. శశికాంత్ మోసాలపై సమగ్రమైన విచారణ చేస్తే రెండు తెలుగు రాష్ర్టాల్లో బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.