హైదరాబాద్: హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీలో (KPHB) భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీలోని అర్జున్ థియేటర్ సమీపంలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో హోటల్లో ఉన్న ఫర్నీచర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. హోటల్ వెలుపల ఆపి ఉంచిన రెండు మోటారు సైకిళ్లు కూడా దగ్ధమైంది. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే హోటల్ మొత్తం దగ్ధమైపోయింది. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియారాలేదు. అయితే షార్ట్ స్కర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. కాగా, తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.