హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మరాఠా మండల్ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో కలిశారు.
ఉప్పల్ భగాయత్‌లో మరాఠా మండల్ కు ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని కేటాయించినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో మండల్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాటిల్, వైస్ ప్రెసిడెంట్ నివాస్ నిక్కం, మదన్ జాదవ్, ఎల్కే షిండే ఆనంద్ పాటిల్ తదితరులు ఉన్నారు.