సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): నలభై ఏండ్ల అజ్ఞాతం వీడి ఇద్దరు మావోయిస్టులు గురువారం లొంగిపోయారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. కాకర్ల సునీత అలియాస్ బద్రీ అలియాస్ లక్ష్మి అలియాస్ గురుస్మృతి అలియాస్ స రోజా 1985లో రాజమండ్రిలో ఇంటర్ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ)కు ఆకర్షితురాలైంది. ఆమె తండ్రి సత్యనారాయణ సినీ కళాకారుడు, విప్లవ రచయిత. ఆయనను కలిసేందుకు వరవరరావు, గద్దరు తదితరులు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు, ఆర్ఎస్యూ, తండ్రి దగ్గరకు వచ్చిపోయే వారి మాటలకు సునీత ప్రేరేపితమై 1986లో పీపుల్స్ వార్‌లో చేరింది. 1986 నుంచి 1990 వరకు విజయవాడ టౌన్ సెంట్రల్ ఆర్గనైజర్‌గా పనిచేసింది.
ఈ క్రమంలో టీఎల్ఎన్ చలం అలియాస్ గౌతం అలియాస్ సుధాకర్‌తో పరిచయంతో ఏర్పడి 1986లో వివాహం చేసుకుంది. 2006లో ఆంధ్ర, ఒడిశా బార్డర్, అక్కడి నుంచి దండకారణ్యంకు బదిలీ అయ్యారు. అంతకు ముందే భర్త చలం 2005లో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన చర్చలో పాల్గొన్నారు. వలిగొండ, బైరవకోణ, పూజరిగూడ, కుట్, అన్నపురం నేషనల్ పార్కు తదితర ఎన్కౌంటర్లలో దంపతులిద్దిరూ పాల్గొన్నారు. తన భర్తతో కలిసి మావోయిస్టులో రీజినల్ పొలిటికల్ స్కూల్‌ను, ఎడ్యుకేషన్ డిపార్టుమెంటల్ కమిటీలో సభ్యులుగా ఉంటూ కొత్త రిక్రూట్మెంట్, రాజకీయ అవగాహనను తీసుకువచ్చే బోధనలు చేసింది. 2025, జూన్, 5వ తేదీన అన్నపురం నేషనల్పార్కు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో భర్త చలం మృతి చెందగా సునీత తప్పించుకుంది.
ఆమె మావోయిస్టు పార్టీ నిర్వహించే క్రాంతి మ్యాగజైన్ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. సునీత సోదరి మాధవి కూడా మావోయిస్టు భావాజాలానికి ఆకర్షితురాలై అందులోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారని, ఆమెతో పాటు అందరూ జనజీవనస్రవంతిలో కలువాలని సీపీ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ హోదాలకు చెందిన 387 మంది జనజీవన స్రవంతిలో కలిసిశారని వెల్లడించారు. సునీతపై రూ. 20 లక్షల రివార్డు ఉందని ప్రభుత్వం నుంచి జారీ అయిన చెక్కును సీపీ ఆమెకు అందజేసినట్లు తెలిపారు.
2006లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి చదువుతుండగా మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడైన భూపాలపల్లి జిల్లా, రంగాయపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి హరీశ్ అలియాస్ రమాన్న అలియాస్ శ్రీను మావోయిస్టు పార్టీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. 2015లో అశ్వినితో వివాహం చేసుకొని 2018లో విడాకులు ఇచ్చాడు. సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకుడు విజేందర్ ఇచ్చిన పిలుపుతో మావోయిస్టు పార్టీలో చేరాడు. భద్రాచలం పోలీసులు హరీశ్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
నెల రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు బాదె చొక్కరావు అలియాస్ దామోదర్ ఇచ్చిన పిలుపుతో 2020లో తిరిగి మావోయిస్టు పార్టీలో చేరాడు. 2021 నుంచి నేషనల్ పార్కు ప్రాంతంలోని మంగి, ఇంద్రవెళ్లి ఏరియా దళంలో పనిచేస్తూ ఆదిలాబాద్‌కు వచ్చిపోయేవాడు. 2022 డిసెంబర్లో టేకమెట్టలో జరిగిన ఎన్కౌంటర్లో కుడి కాలుకు బుల్లెట్ తగిలింది. ఈ ఏడాది జూన్, 7వ తేదీన నేషనల్ పార్కు ఏరియాలోని ఇర్పాగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హరీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతడిపై రూ. 4 లక్షల రివార్డు ఉండగా ఆ చెక్కును సీపీ అందజేశారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ ఏసీపీ సత్తయ్యగౌడ్ అధికారులు పాల్గొన్నారు.