ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 8: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు అధ్యాపకులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు మంగళవారం తరగతులు బహిష్కరించి యూనివర్సిటీ అడ్మినిస్టేష్రన్ భవనం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
సంఘం నాయకులు డాక్టర్ సీమర్ల విజేందర్ రెడ్డి, డాక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ..యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్ల సమస్య పరిష్కరించకుండా జీవో 21ను తీసుకువచ్చారని.. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ సమస్యలను పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ రేష్మారెడ్డి, డాక్టర్ మోడెం రవి, డాక్టర్ ఓ కృష్ణయ్య, డాక్టర్ తాలపల్లి వెంకటేశ్, డాక్టర్ మహేందర్, డాక్టర్ అరుణ్, డాక్టర్ కిరణ్, డాక్టర్ అశోక్, డాక్టర్ వాణి, డాక్టర్ హరీశ్, డాక్టర్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా వర్సిటీలో తరగతుల బహిష్కరణ
జియాగూడ, ఏఫ్రిల్ 8: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలోని కాంట్రాక్ట్ అధ్యాపకులు మంగళవారం తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఆ వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ కన్వీనర్ ఉపేందర్‌రావు మాట్లాడుతూ..
కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతే మాత్రమే… కొత్త నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలో కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ ఈ ఉపేందర్ రావ్, డాక్టర్ వినీత పాండే, డాక్టర్ రజిని, డాక్టర్ సనత్, డాక్టర్ రవి, డాక్టర్ సునీత, జ్యోతి, డాక్టర్ కృష్ణ వేణి, డాక్టర్ కృష్ణాజి, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.