సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) ;అథారిటీ మహోన్నత పాత్ర పోషిస్తున్నది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా చేపడుతూ.. నగరవాసులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023లో నగర భవిష్యత్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా.. హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేశాయి. ఐటీ రంగంలోనే కాకుండా రియల్ ఎస్టేట్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్స్ వంటి వాటిల్లో వేల కోట్ల పెట్టుబడులు నగరం చుట్టూ పక్కల ప్రాంతాల్లో వచ్చాయి. ముఖ్యంగా మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ చుట్టూ కీలక ప్రాజెక్టులను చేపట్టి.. అభివృద్ధికి కేంద్రంగా మార్చింది హెచ్ఎండీఏ.
భారీ లే అవుట్..నియోపోలిస్
కోకాపేటలో నియోపోలిస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో భారీ లే అవుట్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇది సుమారు 529.66 ఎకరాల్లో అభివృద్ధి చేసిన గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. 150, 120 అడుగుల వెడల్పుతో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లు, మంచినీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 300 కోట్లు వెచ్చించారు. ఇదే లే అవుట్లో ఎకరం స్థలానికి ధర రూ.100 కోట్లకు పైగా పలకడం దేశంలోనే సంచలనంగా మారింది. అదే విధంగా బుద్వేల్‌లో 180 ఎకరాల్లో లే అవుట్ అభివృద్ధి పనులను హెచ్ఎండీఏ చేపట్టగా, అవి పురోగతిలో ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో అత్యంత కీలకమైన బాచుపల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని సుమారు రూ. 173.42 కోట్ల వ్యయంతో ఈ పనులను హెచ్ఎండీఏ నిర్వహిస్తున్నది.
శివార్లలో రోడ్ల విస్తరణ…
నగరానికి ఉత్తర- పడమర దిక్కులను కలిపేలా రోడ్ల విస్తరణ చేపట్టాలని, అవసరమైన చోట ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ ఒకేసారి మూడు పనులను చేపట్టింది. బాచుపల్లి నుంచి బౌరం పేట వరకు 4 లేన్ల రోడ్డు విస్తరణ, బాచుపల్లి జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మాణం, బహదూర్‌పల్లి- కొంపల్లి మార్గంలో 4 లేన్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి. సుమారు రూ.173.42 కోట్ల వ్యయంతో ఈ పనులను హెచ్ఎండీఏ నిర్వహిస్తున్నది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.
పచ్చని అందాలతో లేక్వ్యూలు..
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్-సికింద్రాబాద్ మధ్య వారధిగా ఉన్న ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసమే సుమారు రూ.27 కోట్లు వెచ్చించారు. నెక్లెస్ రోడ్డులో రూ. లేక్‌వ్యూ పార్కును రూ.15 కోట్లతో సరికొత్త థీమ్‌తో నిర్మించారు. ఐటీ కారిడార్‌లో అత్యాధునికంగా అభివృద్ధి చేసిన గండిపేట లేక్ వ్యూ పార్కు ప్రత్యేకతను సంతరించుకున్నది. దీంతో పాటు ఓఆర్ఆర్ను అనుకొని హిమాయత్‌సాగర్ పక్కన ఉన్న కొత్వాల్‌గూడలో సుమారు రూ.300 కోట్లతో ఎకో పార్కు అభివృద్ధి పనులు ప్రస్తుతం పురోగతి ఉన్నాయి.
మూసీ..ఈసీలపై 14 వంతెనలు..
గత కేసీఆర్ ప్రభుత్వం మూసీ, ఈసీ నదులపై ఒకేసారి 14 చోట్ల కొత్తగా వంతెనలను నిర్మించాలని నిర్ణయించి, టెండర్లు సైతం పిలిచింది. ఇందులో 5 బ్రిడ్జిలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చేపడుతున్నది. అయితే ఎన్నికల తర్వాత పనులు ముందుకు సాగడం లేదు.
రియల్ ఎస్టేట్ మార్కెట్ లీడర్‌గా..
హైదరాబాద్ మహా నగరం… రియల్ రంగంలో పెట్టుబడులకు స్వర్గధామం. కరోనా సంక్షోభంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోని ఈ రంగం తిరోగమనాన్ని సూచించినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేసింది భాగ్యనగరం. దేశంలోని మెట్రో నగరాల్లో 2023లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పలు అంశాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. నివాస గృహాలు, ఆఫీసు స్థలాలు, అందుబాటు ధరల్లో ఇండ్లు.. ఇలా అన్ని కేటగిరీల్లో కొనుగోళ్లు హైదరాబాద్ కేంద్రంగా అధిక సంఖ్యలో క్రయ, విక్రయాలు జరిగాయని దేశ, విదేశాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై అధ్యయనం చేస్తున్న పలు సంస్థలు తమ నివేదికల్లో వెల్లడించాయి. జేఎల్ఎల్… నైట్‌ఫ్రాంక్… 99 ఏకర్స్… అన్‌రాక్… వంటి సంస్థలు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా హైదరాబాద్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి.
సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్…
ఔటర్ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర నిర్మించిన సోలార్‌రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను 2023లోనే ప్రారంభించారు. ఐటీ కారిడార్‌లో నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైకిల్ ట్రాక్ వెంబడి నిర్మించిన సోలార్ ప్యానల్స్ ద్వారా సుమారు 13 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. దీంతో పాటు ఐటీ కారిడార్‌లోని నార్సింగి వద్ద ఒక ఇంటర్ చేంజ్‌ను, పటాన్‌చెరూ తర్వాత మల్లంపేట వద్ద మరో ఇంటర్‌చేంజ్‌ను ప్రారంభించారు.
ఓఆర్ఆర్పై అడుగడుగునా పచ్చదనం..
ఔటర్ రింగు రోడ్డు అంటే కేవలం ప్రయాణం మాత్రమే కాదు… ఆహ్లాదం, పచ్చదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఔటర్ వెంట చూడచక్కని ఆకృతులను ఏర్పాటు చేస్తూ నగరవాసులను ఆకట్టుకునేలా హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. నగరంలోని గచ్చిబౌలి నుంచి మొదలయ్యే ఓఆర్ఆర్పై అడుగడుగునా పచ్చదనం ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ర్యాంపులు, ఇంటర్చేంజ్ వద్ద ఆకట్టునేలా కళాకృతులను ఏర్పాటు చేసి.. సరికొత్త అందాలను ఓఆర్ఆర్కు అద్దారు.
మూసీ,ఈసీ నదులపై హెచ్ఎండీఏ నిర్మించే వంతెనలు..
ఈసీ నదిపై రాజేంద్రనగర్-బుద్వేల్ ఐటీ పార్కు-1
(180 మీటర్ల పొడవు, 4 లేన్లు) రూ.19.83 కోట్లు
రాజేంద్రనగర్-బుద్వేల్ ఐటీ పార్కు-2
(196 మీటర్ల పొడవు, 4 లేన్లు) రూ.20.64 కోట్లు
మూసీ నదిపై మంచి రేవుల వద్ద హైలెవల్ బ్రిడ్జి
(180 మీటర్ల పొడవు, 4 లేన్లు) రూ.32.21 కోట్లు
ఉప్పల్ భగాయత్ లే అవుట్ వద్ద వంతెన
(210 మీటర్ల పొడవు, 4 లేన్లు) రూ.29.28 కోట్లు
ప్రతాప సింగారం వద్ద బ్రిడ్జి
(210 మీటర్ల పొడవు, 4 లేన్లు) రూ.26.94 కోట్లు