సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : నగర ట్రాఫిక్ వ్యవస్థలో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ విభాగాన్ని సాంకేతిక పరంగా మరింత బలోపేతం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రూ.10 కోట్లతో సమకూర్చుకున్న మ్యాన్‌ప్యాక్ సెట్లను సీపీ ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటి సారిగా 1000 మ్యాన్‌ప్యాక్‌లను ఒకేసారి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమకూర్చుకున్నారని, దీంతో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందిస్తామన్నారు. ఈ మ్యాన్‌ప్యాక్‌లు కొనేందుకు కష్టపడాల్సి వచ్చిందని, మోటరోలా కంపెనీతో అనేక చర్చల తరువాత ఢిల్లీలోని వైర్లెస్ ఫ్లానింగ్ అండ్ కో-అర్డినేషన్(డబ్ల్యూపీసీ) విభాగం నుంచి అనుమతులు పొంది వీటిని కొనుగోలు చేశామన్నారు. నగరంలో సమర్థవంతంగా, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ అప్‌గ్రేడేషన్ పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. ఆపరేషన్ రోప్, ట్రాఫిక్ నిర్వహణ ఇతర అంశాలను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసుల కృషి చాలా బాగుందని అభినందించారు. ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం, వారికి అధునాతన పరికరాలను అందిస్తామని సీపీ హామీ ఇచ్చారు. కొత్త మ్యాన్ ప్యాక్‌లు ప్రస్తుతం ఏపీసీ 016 ట్రాకింగ్ సిస్టమ్ నుంచి భవిష్యత్తులో ఏపీసీఎం 25పీ-2 ట్రాకింగ్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని, డ్యూయల్ మైక్రో ఫోన్, రోడ్డుపై మాట్లాడుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్లో శబ్ధం రాకుండా ఉండే విధంగా నాణ్యమైన ఆడియో, బ్యాటరీ, స్కానింగ్ సౌకర్యం, టెక్ట్స్ మెసేజ్, జీపీఎస్ ఇంటిగ్రేటెడ్ తదితర ఆధునీక సౌకర్యాలు ఇందులో ఉన్నాయని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. ఈ సమావేశంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, శ్రీనివాస్, కమ్యూనికేషన్స్ ఎస్పీ వినోద్‌కుమార్, అదనపు డీసీపీ రంగారావు తదితరులు పాల్గొన్నారు.