GHMC | చిక్కడపల్లి, జూన్ 11: అనుమతి లేకుండా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో కొనసాగిస్తున్న మాంగళ్య షోరూం భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు సీజ్ చేశారు. అసంపూర్తి భవనంలో ఏర్పాటు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(OC) లేకుండానే షాపింగ్ మాల్‌ను కొనసాగిస్తున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలకు దిగారు. బుధవారం నాడు మాంగళ్య షాపింగ్ మాల్‌ను మూసివేసి సీల్ వేశారు. టౌన్ ప్లానింగ్ అదనపు సీపీ ప్రదీన్ పర్యవేక్షణలో ప్రధాన కార్యాలయం ఏసీపీ భార్గవి, సర్కిల్ 15 ఏసీపీ దేవేందర్ సహా పలువురు అధికారులు మాల్‌ను సీజ్ చేశారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గత 8 నెలల నుంచి మాంగళ్య షాపింగ్ మాల్ కొనసాగుతుంది. మాల్ కొనసాగుతున్న భవన సముదాయానికి ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు కాలేదు. ఏఎంబీ మినీ పేరిట మల్టీప్లెక్స్‌లో నిర్మిస్తున్న ఈ భవనం పనులు ఇంకా పూర్తి కాలేదు. ఒక పక్క నిర్మాణ పనులు కొనసాగుతుండగానే గత సంవత్సరంలోని ఒక అంతస్తులో మాంగళ్య షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. అయితే నిర్మాణం పూర్తి చేయకుండా, నిబంధనల పాటించకుండా షాపింగ్ మాల్ తెరిచి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మాల్‌ను సీజ్ చేశారు