ఖైరతాబాద్, జూలై 22: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయాయి.. రూపాయి పింఛన్ల పెంపు, నూతన పింఛన్లు ఇవ్వకపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలపుడు ఇచ్చిన ‘హామీనైనా నిలబెట్టుకోవాలి..లేదా రాజీనామానైనా చేయాలి’ అని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, చేయూత కింద వృద్ధులు, వింతంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులు, మూత్రపిండాల బాధితులకు రూ.4వేల పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. అధకారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పింఛన్లు పెంచలేదని, పాత పింఛన్లు సైతం మొక్కుబడిగా చెల్లిస్తున్నారని ఆరోపించారు.
రూ.20వేల కోట్లు పింఛన్ బకాయిలను రైతు రుణమాఫీ, రైతు భరోసాకు మళ్లించారని మందకృష్ణ ఆరోపించారు. తక్షణమే మేనిషెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల గర్జన కార్యక్రమాన్ని చేపడుతామని మందకృష్ణ స్పష్టం చేశారు.