సిటీబ్యూరో, జులై 22 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆటో కొనుగోలు చేయాలంటే ఫైనాన్స్ తీసుకునే వారిపై అదనంగా రూ.30 వేల నుంచి 40వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా వేలాది మంది ఆటో ్రడ్రైవర్ల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఒక్క సీఎన్జీ ఆటో రూ.2.40లక్షలు ఉండగా ఫైనాన్స్ పేరు మీద అదనంగా రూ.30 వేల భారం మోపారు.
మరోవైపు షోరూం నిర్వాహకులు అదనంగా రూ.40 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధిక డబ్బులపై ప్రశ్నిస్తే ఆటో కొనుగోలుకు అనుమతినివ్వరోమననే భయంతో ఫైనాన్స్‌కు అంగీకరిస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లిన చర్యలు తీసుకోవడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. నగరంలో 90 శాతం ఫైనాన్స్ సంస్థలకు అనుమతి లేదు. కానీ అనధికారికంగా వారు ఇష్టానుసారంగా అధిక డబ్బులు మోపుతూ ఫైనాన్స్ ప్రక్రియను చేస్తున్నారు.
ఇందులో అటు రాజకీయ నాయకుల అండదండలున్న ఓ పది ఫైనాన్స్ సంస్థలు ప్రత్యేక కౌంటర్లు తెరిచి ఆటో దరఖాస్తులను అప్లోడ్ చేయిస్తున్నారు. వీరు చెప్పిన వారికే ఆటో అందేలా అటు ఆర్టీఏ అధికారుల నుంచి సైతం అనుమతులిప్పిస్తున్నారు. దీంతో సగటు ఆటో జీవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కాగా, నగరంలో మూడు షోరూంల్లో కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తనిఖీలు చేసి దరఖాస్తు వివరాలు సేకరించారు.
రేవంత్ సర్కార్‌లో ఆదినుంచి కష్టాలే ..
ఆటో అంటే రోడ్డెక్కి ప్రయాణికులను గమ్యానికి చేర్చి వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం. రాత్రింబవళ్లు కష్టపడితే వచ్చే ఆ ఆదాయంతో అటు కుటుంబాన్ని ఇటు పిల్లల చదువును నెట్టుకురావాలి. అందుకే ఆటో నడుపుకోవడానికి చాలా మంది ముందుకు వస్తుంటారు. అయితే ఈ మధ్యతరగతి బండిపై కొంతమంది ఫైనాన్షియర్లు కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం కోసం బతుకుబండిని నడుపుకోవాలనుకునే సగటు ఆటో డ్రైవర్‌కు రేవంత్ సర్కార్ పాలనలో ఆది నుంచి కష్టాలే మొదలయ్యాయి.
ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో ఉపాధిని ముంచేసిన ప్రభుత్వం.. తాజాగా గ్రేటర్లో 10వేల కొత్త ఆటోలకు అనుమతినిస్తూ జీవో 263 తీసుకొచ్చింది. అయితే ఈ జీఓకు విరుద్ధంగా షోరూం నిర్వాహుకులు, ఫైనాన్షియర్లు ఆటోల కొనుగోలు ప్రక్రియను చేపట్టడంతో ఆటో డ్రైవర్లు మళ్లీ మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో ప్రకారం సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కానీ పెట్రోల్‌తో కూడిన సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఓఆర్ఆర్ లోపల పెట్రోల్, డీజిల్ ఆటోలు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా క్షేత్రస్థాయిలో రవాణా శాఖ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం వారికి చెల్లింది.
మా బతుకులతో ఆడుకుంటున్నరు
ఫైనాన్షియర్ల మా బతుకులతో ఆడుకుంటున్నారు. మేం బతుకు కోసం ఆటో కొనుగోలు చేయాలనుకుంటే వారు మాపై దందా చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓను ప్రైవేట్ వ్యక్తులు శాసించడం ఏంటి? అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇప్పటికే 14వేల ఆటోలు గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లిపోయాయి. అవన్నీ కమీషన్ల మీదనే జరిగాయి. వెంటనే వాటిని రద్దు చేసి మళ్లీ అధికారుల సమక్షంలో ప్రక్రియ చేపట్టాలి. మాలాంటి సగటు ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి.
– కిషన్, ఆటోడ్రైవర్
అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నరు
ఆర్టీఏ అధికారులు నిర్వహించాల్సిన ప్రక్రియను డీలర్లకు ఇవ్వడంలో మతలబు ఏంటి? ఒక్క ఆటోపై మా నుంచి అదనంగా రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. లక్ష రూపాయల డౌన్ పేమెంట్ కట్టించుకొని.. రెండు నెలలు కిస్తీ ఆలస్యమైతే డ్రైవర్‌ను పక్కకు తోసేసి బండి లాక్కుంటున్నారు. అదే బండిని మరొకరికి రూ.7లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని జీఓ చెబుతున్నా.. షోరూంలు మాత్రం అప్లోడ్ చేయడానికి రూ.5వేల వరకు వసూలు చేశారు.
-శంకర్, ఆటోడ్రైవర్