సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మెట్రో అంశాన్ని ప్రస్తావించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ పీపీపీ మెట్రోగా పేర్కొంది. వర్సిటీ విద్యార్థుల అధ్యయనానికి పరిశోధన పత్రాలుగా మెట్రో ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకుంది. రవాణా వ్యవస్థ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, నిర్మాణంలో నూతన ఒరవడి, ఎదురైన సవాళ్లు, చూపిన పరిష్కారాలతో కూడిన పరిశోధన పత్రాన్ని కేస్ స్టడీగా స్వీకరించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు వచ్చిందని, భూసేకరణ సమస్యలు, ఆర్థిక సవాళ్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో అత్యుత్తమ మెట్రో వ్యవస్థగా పేర్కొన్నారు. దశలవారీగా చేపట్టిన ప్రాజెక్టు ప్రగతిని కేస్ స్టడీలో ప్రత్యేకంగా వివరించినట్లుగా మెట్రో సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా ఇప్పటికే ఐఎస్బీ, స్టాన్ఫోర్డ్ లాంటి అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు హైదరాబాద్ మెట్రో రైలును ప్రస్తావించడం హైదరాబాద్ నగరానికి దక్కిన అరుదైన గౌరవమని హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.