కొండాపూర్, మార్చి 27: సెల్ఫ్ డ్రైవ్ యాప్‌లో కారును అద్దెకు తీసుకుని, అమ్ముకున్న వ్యక్తిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్ఎఎల్ ఎంఐజీలో నివాసం ఉండే సుమన్ అల్లగిరికి చెందిన ఇన్నోవా హైక్రాస్ కారును జనవరి 27వ తేదీన మహ్మద్ నజీర్ అనే వ్యక్తి జూమ్ కారు యాప్ ద్వారా సెల్ఫ్ డ్రైవ్కుఅద్దెకు తీసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో బంధువుల పెండ్లి ఉందని, వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకుంటున్నట్లు సుమన్‌కు వివరించాడు. నజీర్ కారును తిరిగివ్వక పోగా, ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో బాధితుడు చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోకేషన్ ట్రాకింగ్‌తో కారును గుర్తించి కారుతో పాటు నజీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా నిందితుడు అద్దెకు తీసుకున్న కారును పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రూ.11.50లక్షలకు విక్రయించగా, కారు అప్పటికే దెబ్బతిన్న స్థితికి చేరుకుంది. నజీర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచారు. జూమ్ యాప్ నుంచి సైతం ఎలాంటి రిప్లై రాలేదంటూ దాటవేస్తున్నారు.