బంజారాహిల్స్, ఏప్రిల్ 26 : అమ్మానాన్నలు లేకపోవడంతో పాటు బంధువులు ఎవరూ ఆదరించకపోవడంతో నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేరని, మున్సిపాలిటీ సిబ్బందితో అంత్యక్రియలు చేయించాలంటూ కువైట్‌లో ఉన్న సోదరి పోలీసులను కోరింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా జీహెచ్ఎంసీ పునరావాస కేంద్రంలో ఉంటూ స్థానికంగా అక్కడికి వచ్చేవారు పెట్టే ఆహారం తింటూ జీవనం సాగిస్తున్న పవన్‌కుమార్ మహానంది(37) మూడురోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పవన్‌కుమార్ జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా అతడిది తిరుపతి అని తేలింది. కాగా అతడి జేబులో దొరికిన ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు విచారించగా అతడికి తల్లిదండ్రులు లేరని, కువైట్‌లో సోదరి ఉందని తేలింది. ఆమెకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బంధువులు ఉంటే వారిని పంపించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. అయితే తమకు బంధువులు ఎవరూ లేరని, తాను కువైట్ నుంచి వచ్చి అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదని సోదరి శారద చెప్పింది. అతడి మృతదేహాన్ని మున్సిపాలిటీకి అప్పగించి అంత్యక్రియలు చేయించాలని వేడుకుంది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. ఒకటిరెండురోజుల్లో మున్సిపాలిటీ అధికారులకు లేఖరాసి అంత్యక్రియలు చేయిస్తామని పోలీసులు తెలిపారు.