జగద్గిరిగుట్ట, నవంబరు5 : పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. అందరూ చూస్తున్నా దాడి చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన జగద్గిరిగుట్టలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డినగర్‌కు చెందిన రోషన్ సింగ్ (25) ఆటోడ్రైవర్. అతనిపై బాలానగర్ పోలీస్టేషన్లో రౌడీషీట్ నమోదు చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన రౌడీషీటర్ బాలశౌరిరెడ్డి (26) అతనికి పరిచయస్తుడు. కొంతకాలంగా వీరిమధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోషన్ సింగ్, అతని స్నేహితుడు మనోహర్ జగద్గిరిగుట్టలో బస్టాప్‌లో ఉన్నారు. బాలశౌరిరెడ్డి, అతని స్నేహితులు ఆదిల్, మహ్మద్ బుల్లెట్ బైక్‌పై వచ్చారు.
ఒకరు బైక్‌పై ఉండగా.. ఇద్దరు బాధితుడి వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి.. ఆ తర్వాత బాలశౌరిరెడ్డి కత్తితో రోషన్‌పై పలుసార్లు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత నిందితులు బైక్‌పై పరారయ్యారు. నిందితుల్లో ఒకరు రోషన్‌ను పట్టుకోగా బాలశౌరిరెడ్డి పదిసార్లు కత్తితో దాడి చేశాడు. దాంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ నరేష్‌రెడ్డి పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాధితుడు రోషన్ సోదరుడు రోహిత్ కొన్నేళ్ల కిందట శంషాబాద్‌లో హత్యకు గురయ్యాడని.. నేరనేపథ్యం ఉన్న వ్యక్తులతో వివాదాలే ఈ కత్తిపోట్లకు దారి తీసినట్లు తెలుస్తున్నది. రోషన్ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయని.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.