ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 3: తార్నాక డివిజన్లోని ఎర్రకుంట చెరువులో సోమవారం మృతదేహం లభ్యమైన కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఓయూ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ బాలస్వామి వెల్లడించారు. సికింద్రాబాద్ చిలకలగూడలో నివాసముండే షేక్ గౌస్, రాంనగర్ ఫిష్ మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తుండేవాడు. అతని దగ్గర అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ షోయబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. వారిద్దరూ కలిసి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేపలను సరఫరా చేసేవారు.
వారి వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో వీరికి ధూల్‌పేట్‌కు చెందిన మాగుసింగ్ (58) పరిచయమయ్యాడు. చేతబడి ద్వారా వ్యాపారంలో లాభాలు వస్తాయని, కుటుంబ సమస్యలు సైతం పరిష్కరిస్తానని నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మిన గౌస్, షోయబ్‌లు దానికి అంగీకరించి, అతను అడిగినా కొద్దీ డబ్బులు ఇస్తూ పోయారు. ఇలా వారి నుంచి మాగుసింగ్ రూ.15 లక్షలు వసూలు చేశాడు. చేతబడి ద్వారా తమకు ప్రయోజనం లేదని వారు మాగుసింగ్ను నిలదీశారు. అయినా మాగుసింగ్ తనకు మరిన్ని డబ్బులు ఇవ్వాలని, లేనిపక్షంలో చేతబడి ద్వారా మరింత నష్టం కలిగిస్తానని బెదిరించాడు.
దాంతోపాటు గౌడ్ భార్యకు అక్రమసంబంధాలు ఉన్నాయని పుకారు చేశా డు. ఈ నేపథ్యంలో షోయబ్ కూతురు అనారోగ్యంతో మృతి చెందిం ది. దీంతో మాగుసింగ్ చేతబడి కారణంగానే చనిపోయిందని వారు అతనిపై కక్ష పెంచుకున్నారు. ఇద్దరూ కలిసి మాగుసింగ్ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న షోయబ్ ధూల్‌పేట్‌కు వెళ్లి చేతబడి చేయాలని చెప్పి మాగుసింగ్ను తన ద్విచక్రవాహనంపై చిలకలగూడకు తీసుకొచ్చాడు. అక్కడికి రాగానే గౌస్ తన చేతిలోని ఇనుపరాడ్‌తో మాగుసింగ్ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై మాగుసింగ్ కింద పడిపోయాడు. అప్పటికే సిద్ధం చేసిన కారులో మాగుసింగ్ను అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇలియాస్‌తో కలిసి ఎర్రకుంటకు తరలించారు.
అక్కడే గౌస్ తన వద్ద ఉన్న కత్తితో మాగుసింగ్ గొంతు కోసి హత్య చేశాడు. ఎర్రకుంట చెరువు చెత్తకుప్పపై మృతదేహం పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడిని గుర్తించారు. ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, హత్య చేసిన గౌస్, షోయబ్‌లతో పాటు సహకరించిన ఇలియాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గౌస్‌పై గతంలో బంజారాహిల్స్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నాయి. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, సీఐ అప్పలనాయుడు, డీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.