మేడ్చల్, జూలై 13 : స్క్రాప్ డబ్బుల పంపిణీ విషయంలో తలెత్తిన గొడవ కారణంగా భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని కొట్టి చంపారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన ఎదునూరి నరసింహ అలియాస్ చిన్న (32), భార్య అనిత(30)తో కలిసి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్‌పోస్ట్‌లో నివాసం ఉంటున్నారు. రోడ్ల పక్కన కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి.. అమ్ముకొని.. జీవనం సాగిస్తున్నారు.
మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు (37) శనివారం మధ్యాహ్నం మేడ్చల్ చెక్‌పోస్ట్‌లోని వెంకటరమణ లిక్కర్ ల్యాండ్ వద్ద మద్యం తాగుతున్నాడు. అయితే.. స్క్రాప్ డబ్బుల పంపిణీ విషయంలో నర్సింహ, అనితలతో నర్సింహులుకు గొడవ జరిగింది. ఈ క్రమంలో వారిద్దరు కలిసి నర్సింహులును కట్టెలతో కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. వైన్ షాప్ నిర్వాహుకుడు మహేశ్.. రాత్రి 8 గంటల సమయంలో గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. నిందితులైన భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వైన్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఒక వ్యక్తి ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఘటన జరిగితే రాత్రి 8 గంటల వరకు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. గొడవ జరిగినప్పుడే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే నర్సింహులు బతికి ఉండేవాడని అంటున్నారు.