పెద్దఅంబర్‌పేట, మార్చి 15 : కంటికి రెప్పలా చూసుకుంటానని ఏడు అడుగులు నడిచిన భర్తే కాల యముడిగా మారాడు. కొడుకు పుట్టాడన్న సంతోషాన్ని ఇంకా ఆస్వాదించకముందే ఊపిరి తీశాడు. బాలింత అనే కనికరం కూడా లేకుండా గొడ్డలి వేటుకు బలిచ్చాడు. నెలన్నర వయసున్న కన్న కొడును సైతం సంపులో పడేశాడు. ఓ కసాయి తండ్రి కిరాతకానికి భార్య, పసికందు ప్రాణాలు కోల్పోగా.. రెండేండ్ల ఆడ బిడ్డ అనాథగా మారింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని అనాజ్‌పూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి, స్థానికుల కథనం ప్రకారం.. బండరావిరాల గ్రామానికి చెందిన లావణ్య(28)కి అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌తో ఐదేండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి రెండేండ్ల కూతురు ఆద్య, నెలన్నర కుమారుడు క్రియాన్ష్ ఉన్నారు.
లావణ్య బాలింత కావడంతో ఇద్దరు పిల్లలతో కలిసి బండరావిరాలలోని తల్లి దగ్గర ఉంటున్నది. బాబుకు వ్యాక్సిన్ ఇప్పించాల్సి ఉండగా బుధవారం మధ్యాహ్నం లావణ్యతోపాటు ఇద్దరు పిల్లలను ధన్‌రాజ్ బండరావిరాల నుంచి అనాజ్‌పూర్‌లోని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లావణ్యతో గొడవపడ్డాడు. బీరు సీసాతో కొట్టి గొడ్డలితో నరికి చంపేశాడు. నెలన్నర పసికందును ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేసి హతమార్చాడు. కూతురు ఆద్య ఏడుస్తూ బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నట్టు స్థానికులు తెలిపారు.
ఆపై ధన్‌రాజ్ బండిపై హెల్మెట్ పెట్టుకుని పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే పెండ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చామని, మళ్లీ వరకట్నం కోసం తన కూతుర్ని ధన్‌రాజ్ వేధించాడని లావణ్య తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయంలో చాలాసార్లు అల్లుడిని సముదాయించి, నచ్చచెప్పినా మారలేదని, వరకట్నం కోసమే హత్య చేశాడని లావణ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.