మణికొండ, ఆగస్టు 28 : నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నార్సింగి బ్రిడ్జి వద్ద శుక్రవారం వాహనం ఢీకొని ఒకరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమద్ అనే వ్యక్తి గ్రోసరి స్టోర్‌కు సరుకులు డెలివరీ చేసేందుకు బైక్‌పై నార్సింగి నుంచి గండిపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నార్సింగి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే అతడి ద్విచక్ర వాహనం రోడ్డు డివైడర్‌పై ఏర్పాటు చేసిన పూల మొక్క(ట్రీ పాట్)ను ఢీకొట్టింది. అదే సమయంలో గండిపేట నుంచి నార్సింగి వైపు వస్తున్న వాహనం సమద్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో సమద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అతడి సోదరుడు సయ్యద్ సాదత్ ఆస్పత్రికి తరలించాడు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే సమద్ మృతిచెందినట్లు నిర్ధారించారు. సాదత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, వాహనాల కదలికలు, బాధ్యత ఎవరిదనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు సీసీటీవీ పుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వాహనాలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.