మాదాపూర్, ఏప్రిల్ 19 : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద జరిగిన యాక్సిడెంట్లో ఓ వ్యక్తి మరణించాడు. బ్రిడ్జి మీద ఫోటోలు తీసుకుంటున్న వ్యక్తిని కారు ఢీకొనగా తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ వెల్లడించారు. మృతుడిని న్యూ హఫీజ్ పేట్ ఆదిత్య నగర్ కు చెందిన శ్యామ్ రాజ్(28)గా గుర్తించారు.
న్యూ హఫీజ్ పేట్ ఆదిత్య నగర్ కు చెందిన శ్యామ్ రాజ్(28) ఆదివారం తెల్లవారుజామున తన ద్విచక్ర వాహనంపై కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లాడు. అక్కడ బండి ఆపి ఫోటోలు తీసుకుంటుండగా జూబ్లీహిల్స్ వైపు నుంచి ఐకియా వైపు వెళ్తున్న ఓ బెంజ్ కారు వెనకాల నుంచి అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్యామ్ రెండు కాళ్లు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. గాయాల తీవ్రత కారణంగా అతడు చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు.
శ్యామ్ భార్య సహజ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు కలకత్తాలోని క్వాంటం మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిష్టర్ (డబ్ల్యూబీ 06బీ 7003) అయి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు.