Hyderabad | మన్సూరాబాద్, మే 21: ఎల్బీనగర్లోని ఆరెంజ్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వ్యక్తి మృతికి కారకులైన వైద్యులు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు దవాఖాన ముందు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన కాసారపు రమేశ్ (34)కు భార్య అపర్ణ, బాబు, పాప ఉన్నారు. రమేశ్ దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. అతడికి కాళ్ల వాపులు, ఛాతిలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ఆరెంజ్ హాస్పిటల్‌కు సోమవారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. రమేశ్‌ను పరిశీలించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోయాయని, వెంటనే స్టంట్ వేయాలని సూచించారు. మంగళవారం స్టంట్‌ను వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
స్టంట్ వేసేందుకు మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్యులు సాయంత్రం 4 గంటల వరకు బయటకు తీసుకురాలేదు. కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెంది డాక్టర్లపై ఒత్తిడి తీసుకురావడంతో రమేశ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రి వైద్యులు అతడిని పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఎల్బీనగర్లోని ఆరెంజ్ ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చిన బంధువులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రమేశ్ మృతి చెందాడంటూ ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు బంధువులు, కుటుంబసభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులను సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఈ విషయంపై ఆరెంజ్ ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యాన్ని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఎవరూ అందుబాటులోకి రాలేదు.