మణికొండ, ఆగస్టు 14: పాత కక్షలతో ఓ వ్యక్తిని గడ్డం గీసే కత్తితో హత్య చేసిన ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి కుమ్మరి బస్తీకి చెందిన కొండ రాజు(48) స్థానికంగా కట్టింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య వరలక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమీప ప్రాంతంలో ఉండే బంధువు ప్రవీణ్‌కుమార్‌తో రాజుకు కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ 31న తమ ఇంటి ఎదుట ముగ్గులు వేసుకున్న క్రమంలో వాటిని చెరిపేశాడని రాజు ప్రవీణ్‌తో ఘర్షణపడ్డాడు.
అప్పట్లో ఈ గొడవ నార్సింగి పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లి.. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో కేసును వాపసు తీసుకున్నారు. ఈ విషయంలో రాజుపై కక్ష పెంచుకున్న ప్రవీణ్.. అతడిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకొన్నాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి రాజును గడ్డం గీసే కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు. ఉదయం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.