రామంతాపూర్, మే 27 : హైదరాబాద్ హబ్సిగూడ డివిజన్ రాంరెడ్డి నగర్లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. రోడ్డుపై చెత్త వేయవద్దు అని అన్నందుకు పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్పై దాడి చేశారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాంరెడ్డినగర్‌లో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడుస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బకెట్‌తో చెత్తను తెచ్చి రోడ్డుపై పోసేందుకు చూశాడు. ఇది గమనించిన జీహెచ్ఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్ చెత్త వేయవద్దని కోరారు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి.. అక్కడే చెత్తను పారబోసి మున్సిపల్ సూపర్వైజర్ శ్రీనివాస్, కార్మికులు సుజాత, జానకి, దేవిని దుర్భాషలాడి, దాడి చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పారిశుద్ధ్య కార్మికులు.. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.