బడంగ్పేట్, డిసెంబర్10: ఏ నిష్పత్తి ప్రకారం డివిజన్లు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గ పరిధిలో డివిజన్లు గందర గోళంగా చేశారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన డివిజన్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండటంతో ,తుక్కుగూడ, బడంగ్పేట్, నాదర్గుల్, పహాడీషరీఫ్, మీర్పేట్, జల్పల్లి , ప్రశాంత్ హిల్స్ ఏర్పాటు అయోమయంగా ఉందన్నారు. డివిజన్లకు సంబంధించిన నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి గోడు వెల్లబోసుకున్నారు.
భౌగోళికంగా విస్తీర్ణంలో ఉన్న నాదర్గుల్ను రెండు డివిజన్లుగా చేయవలసి ఉందన్నారు. కొన్ని డివిజన్లను 25 వేలకు, 30వేలకు చేసిన అధికారులు 65వేలు జనాభా ఉన్న ఒకే డివిజన్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. డివిజన్ల ఏర్పాటు విస్తీర్ణం ప్రకారం చేశారా? జనాభా ప్రకారం చేశారా అధికారులు స్పష్టం చేయాలన్నారు. మామిడిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న బాలాజీ కాలనీ, రెడ్ రోజ్ కాలనీ,వేంకటేశ్వర స్వామి దేవాలయం జల్పల్లిలో కలిపే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
పహాడీషరీఫ్ డివిజన్లో కలిపిన మామిడిపల్లిని జల్పల్లి డివిజన్లో కలపాలని మాజీ కార్పొరేటర్లు యాతం పవన్ కుమార్, శివకుమార్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. నాదర్గుల్ డివిజన్ను రెండు డివిజన్లుగా ఏర్పాటు చేసే విధంగా చూడాలని బీఆర్ఎస్ బడంగ్పేట్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో రామిడి రాంరెడ్డి, ఆనంద్ రెడ్డి, కృష్ణారెడ్డి, జంగారెడ్డి, రఘునందన చారి, రాంరెడ్డి, అర్జున్,శ్రీనివాస్ రెడ్డి, సాంబశివ, అరవింద్ గౌడ్, కృష్ణారెడ్డి, జనార్దన్, శ్రీనివాస్ గౌడ్, సునీత, నిర్మల, బీరప్ప, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.