మేడ్చల్, ఫిబ్రవరి 1: గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ స్థాయిలో రూర్కీ ఐఐటీలో నిర్వహించిన ఐడియా థాన్లో ప్రతిభ చూపారు. వారు రూపొందించిన ‘బయోకానిక్ ఐ’కి తృతీయ బహుమతి లభించింది. కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హృషి వెంకట త్రినాథ్, శ్రేయస్, గౌతమ్ ఇటీవల రూర్కీ ఐఐటీలో జరిగిన ఐడియా థాన్లో పాల్గొన్నారు. ఈసీఈ డీన్ డాక్టర్ సునీల్, హెచ్వోడీ మణిగండ దేవరాజన్ మార్గ దర్శకత్వంలో పూర్తి, పాక్షిక అంధత్వ బాధితులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ‘బయోకానిక్ ఐ’ని ప్రదర్శించారు. ఈ పరికరానికి న్యాయ నిర్ణేతలు తృతీయ బహుమతిని ప్రకటించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచంలో సుమారు 3.9 కోట్ల మంది అంధులు ఉండగా, పాక్షిక అంధులు 24.6 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. నేత్ర నాడి, గ్లకోమా, శుక్లమ్ తదితర సమస్యలతో అంధత్వం బారిన పడుతున్నారని, వారి బతుకుల్లో వెలుగులు నింపేలా ‘బయోనిక్ ఐ’ పేరిట కృత్రిమ నేత్రాన్ని రూపొందించామని తెలిపారు. జాతీయ స్థాయి ఐడియా థాన్లో ప్రతిభ చూపిన విద్యార్థులను మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రామస్వామి శనివారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్లో మరిన్ని నూతన ఆవిష్కరణలతో సమాజ హితం కోసం పాటుపడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ‘బయోకానిక్ ఐ’ రూపొందించడంలో మార్గ నిర్దేశం చేసిన ఈసీఈ డీన్ డాక్టర్ సునీల్, హెచ్వోడీ మణిగండ దేవరాజన్ కూడా ప్రత్యేకంగా వారు అభినందించారు.