మల్కాజిగిరి, సెప్టెంబర్ 4: తెట్లకుంట చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్‌కు వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అల్వాల్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, లైబ్రరీ భవనానికి స్థలం, కౌకూర్ తెట్లకుంట చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మల్కాజిగిరిలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్థలం, ఆర్కేపురం చెరువు సుందరీకరణ, రాఘవేంద్రకాలనీలో ప్లే గ్రౌండ్, ముదిరాజ్ భవన నిర్మాణం చేపట్టాలని తెలిపారు. మౌలాలి భరత్నగర్తో పాటు అవసరమైన బస్తీల్లో బస్తీ దవఖానలు ఏర్పాటు చేయాలని వివరించారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం మల్కాజిగిరి చౌరస్తాలోని ఇందిరా భవన్లో తాత్కాలిక కార్యాలయం కేటాయించాలని గతంలోనే కోరామని, ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు.