సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : పరిమితికి మించిన వేగంతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మద్యం, నిద్ర మత్తులో వాహనాలు నడపడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డు ఎక్కాలంటే జనాలు జంకుతున్నారు. అస్తవ్యస్తమైన మలుపులు.. గుంతలమయమైన రోడ్లు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. అధికారుల సమన్వయలోపం.. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ఇంజినీరింగ్ సరిదిద్దడంలో యంత్రాంగం విఫలమవ్వడంతో రహదారులు మృత్యుకూపాలను తలపిస్తున్నాయి. రాంగ్‌రూట్ డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల్లో 1788 రోడ్డు ప్రమాదాలు జరగగా 171 మంది ప్రాణాలు కోల్పోగా 1,588 మందికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కనీస చర్యలు విస్మరించి, చలాన్ వేయడానికే పరిమితమవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ప్రమాదాలను తగ్గించాలని, అధికార యంత్రాంగం పటిష్టంగా పనిచేయాలని కోరుతున్నారు.
రోడ్ల నిర్వహణ బాధ్యత వహించే మున్సిపల్, అర్ అండ్ బీ, జాతీ య రహదారులు, మల్కాజిగిరి పోలీసులకు మధ్య సమన్వయం సరిగా లేకపోవడం కూడా ఈ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయని సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే హడావుడి చేయడం, ఆపై బ్లాక్ స్పాట్లలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. వివిధ శాఖల అధికారులతో ఆరు ప్రత్యేక సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి రోడ్డు ఇంజనీరింగ్ వంటి సమస్యలను పూర్తిస్థాయిలో సరిచేయాలని కోరినా పనులు నామమాత్రంగానే జరిగాయనే ఆరోపణలు సైతం విన్పిస్తున్నాయి.

కుంట్లూరు టీ జంక్షన్, పెద్దఅంబర్‌పేట్ మైసమ్మగుడి, గండిమైసమ్మ, ఆటోనగర్ యూ టర్న్, ఉప్పల్ ఎక్స్ రోడ్, ఈసీఐఎల్, రేతిఫైల్ బస్‌స్టాండ్ వంటి 15 ప్రధాన బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గినా, శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు లభించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సూచనలతో కొన్ని సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, నామమాత్రం గుంతలు పూడ్చడం వంటి ప్రాథమిక చర్యలతోనే రోడ్డు నిర్మాణ పనులను ఆయా విభాగాలు మమ అన్పిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో వైపు ప్రమాదాలను అరికట్టేందుకు మల్కాజిగిరి కమిషనరేట్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లను చేసి, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రోడ్డు ప్రమాదాలు కొద్దిమేర తగ్గాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు ఇంజినీరింగ్ సమస్యలను ఎప్పకటిప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాల్సిన ట్రాఫిక్ విభాగం ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశముంటుంది. ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన, ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
ట్రాఫిక్ పోలీసులు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన కనీస చర్యలను విస్మరించి, కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో చలాన్ వేయడానికే పరిమితమవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని, రోడ్డు భద్రతపై విస్త్రతంగా ప్రచారం చేస్తున్నామంటూ ట్రాఫిక్ పోలీసులు ఆర్భాటాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఇష్టానుసారంగా చలాన్ వేస్తూ, చలాన్ వసూళ్లే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇంజినీరింగ్, బ్లాక్ స్పాట్లను గుర్తించడం, ప్రజలలో అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మరింత పటిష్టంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
మల్కాజిగిరి పరిధిలో 2026 మొదటి ఆరు నెలలలో 1788 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 171 మంది ప్రాణాలు కోల్పోగా 1,588 మంది గాయాలకు గురికావడంతో స్థానికంగా ఉన్న రోడ్డు ప్రమాదకర పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. రోడ్డు నాణ్యత, ఇంజినీరింగ్ వైఫల్యాలతోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం రోడ్డు రూపకల్పన లోపాలు, రోడ్డు ఇంజినీరింగ్ సమస్యలతో 345 ప్రమాదాలు జరిగాయని రోడ్డు భద్రత విభాగం నివేదికలో వెల్లడించడం ఆందోళన కల్గిస్తోంది.
ఇరుకైన రహదారులు, మందుస్తు హెచ్చరికలు లేని మలుపులు, గుంతలమయంగా మారిన రోడ్లు, ఏండ్ల తరబడి పనులు పూర్తికాని నిర్మాణ ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇంజినీరింగ్ లోపాలకు తోడు పరిమితి మిం చిన వేగం, రాంగ్‌రూట్ డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మానవ తప్పిదాలతో 1,443 ప్రమాదాలు జరిగాయి.