సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆయా యజమానులు తిరిగి క్లెయిమ్ చేయని 446 వాహనాలను వేలం వేసేందుకు మల్కాజిగిరి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేలం వేయనున్న వాహనాల జాబితాను mal kajigiripolice.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు మల్కాజిరి పోలీస్ కమిషనర్ సుమతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయా వాహనాల యజమానులు తమ వాహనాలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని, ఈ ప్రకటన వెలువడిన 6 నెలల్లోపు తగిన ధ్రువపత్రాలతో అంబర్‌పేట్‌లోని మల్కాజిగిరి కమిషనరేట్ కార్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీని సంప్రదించాలని కమిషనర్ సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న ఈ వాహనాలను అంబర్‌పేట్‌లోని కార్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించగా అక్కడ నుంచి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌లోని పూలింగ్ పాయింట్లో జమ చేసినట్లు తెలిపారు. 446 వాహనాలలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఉన్నాయని, మరిన్ని వివరాలకు 80083 38535, 87126 62661 నంబర్లను సంప్రదించవచ్చని కమిషనర్ సూచించారు.