పేదల ప్రాణదాతగా గుర్తింపు పొందిన నిమ్స్ దవాఖానలో వైద్యుల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియలో కొందరు పెద్దల చేతివాటంతో అవకతవకలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మంత్రి బంధువు ప్రత్యక్ష ‘హస్తం’ ఉన్నట్లు నిమ్స్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, సదరు పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తయినా.. సకాలంలో ఫలితాలు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని అర్హత కలిగిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– ఖైరతాబాద్, డిసెంబర్ 6
నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూ ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ నియమకాలు చేపట్టాలి. అపస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, కార్డియోవాస్కులర్ అండ్ థోరాసిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్ జెనెటిక్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టీవ్ సర్జరీ, పల్మనరీ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ, రేడియో డయాగ్నాసిస్, రుమటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ తదితర విభాగాల్లో 98 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. ఆ మేరకు ఓ పత్రికలో నోటిఫికేషన్ సైతంప్రచురించారు.
ఓ మంత్రి బంధువు ‘హస్తం’..!
నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోసం అర్హులైన ఎందరో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ నియామకాల్లో అన్ని అర్హతలు ఉన్నా, సరైన పత్రాలు, వివరాలు లేవనే సాకుతో ఇంటర్యూకు హాజరైన వారిలో కొందరిని తిరస్కరించినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నియామకాల వ్యవహారంలో ఓ మంత్రి బంధువు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమ్స్‌లో తరచూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వైద్యాధికారితో పాటు మరికొందరు పెద్దల సహకారంతో ఈ తతంగం నడిపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవకతవకలకు తావు లేదు: నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలలో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఈ నియామకాలను ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో చేపట్టాం. నియామక ప్రక్రియలో భాగంగా దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల నుంచి ఎక్స్‌టర్నల్స్ పాల్గొన్నారు. చంఢీఘర్‌లోని పీజీఐ, ఢిల్లీలోని ఎయిమ్స్, వేలూరులోని సీఎంసీ, పొదుచ్చేరిలోని జిప్మర్ తదితర ప్రఖ్యాత వైద్య కళాశాలలకు చెందిన ఎక్స్‌టర్నల్స్ సమక్షంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను చేపట్టాం.
స్క్రూట్నీ కమిటీ ద్వారా 70 మార్కులు, ఎక్స్‌టర్నల్స్ ద్వారా 15 మార్కులు, డైరెక్టర్ ద్వారా 5 మార్కులు, డీన్ ద్వారా 5 మార్కులు, హానరరీ కన్సల్టెంట్ ద్వారా మరో 5 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించాం. ఇందులో ఎవరూ అత్యధిక మార్కులు స్కోర్ చేస్తారో వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరూ కూడా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అభ్యర్థులకు సామాజిక పరంగా కూడా అన్యాయం జరగకుండా నియామక ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లకు చెందిన ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అన్నిరకాల జాగ్రత్తలు, ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ నియామకాలు జరిగాయి. వివిధ దశల్లో వచ్చిన మార్కులను కలిపే ప్రక్రియ కొనసాగుతున్నది.