మలక్‌పేట, జూలై 10: చాదర్‌ఘాట్ ఇలాహీ మసీదు సమీపంలోని మూసీ లేన్ ప్రాంతంలో ఫ్లవర్ డెకోరేషన్, మోటార్ మెకానిక్ వర్క్‌షాప్‌లు, డెంటింగ్, పేయింటింగ్ ఇతర వాణిజ్య సంస్థల్లో శుక్రవారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంతో వాటిలోని సామగ్రి, కార్లు అంతా కాలి బూడిదవగా, సుమారు రూ. 60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ కారణంగా 60 మంది జీవనోపాధిని కోల్పోయారు. డెకరేషన్ గోదాంతోపాటు మెకానిక్, పెయింటింగ్ షెడ్లలో ఆయిల్, స్పేర్ పార్ట్స్, రసాయన పదార్థాలైన రంగు డబ్బాలు ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఒకదాని వెంబడి ఒకటి 7 షెడ్లకు మంటలు వ్యాపించాయి.
అగ్నికిలలు భారీగా ఎగిసిపడటంతో చూస్తుండగానే వాటిలోని కార్లు, సామగ్రి అంతా కాలి బూడిదయ్యాయి. ఫైర్ అధికారులు రెండున్నర గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న తెలిపారు. మలక్‌పేట, చార్మినార్ ఎమ్మెల్యేలుబలాల, జుల్ఫీకర్ అలీ బాధితులను పరామర్శించారు. జీవనోపాధిని కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారీ పరిస్థితని పర్యవేక్షించారు.