GHMC | సిటీబ్యూరో: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం బాహాబాహీగా జరిగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల మధ్య జరిగిన వాడీవేడి చర్చలో ఎంఐఎం ఒత్తిడికి మేయర్ తలొగ్గారు. హైకోర్టు ఆదేశానుసారంగా నగరంలోని 11 చెరువుల హద్దుల నిర్ధారణ, సుందరీకరణతోపాటు పరిరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చకు స్టాండింగ్ కమిటీ అజెండాలో చేర్చారు. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు… పాత నగరంలో ఉన్న మొత్తం చెరువులను పరిరక్షించాలని, కొన్ని చెరువులను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారని నిలదీశారు.
అజెండాలో చేర్చిన అంశం కూడా అస్పష్టంగానే ఉందని వ్యాఖ్యలు చేయడంతో మేయర్, మజ్లిస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని, ఎవరూ చెప్పిన వినేది లేదంటూ మేయర్ తేల్చి చెప్పినా.. ఎంఐఎం కార్పొరేటర్లు పట్టు విడవలేదు. దీంతో స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఓటింగ్ పెడతామంటూ మేయర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఓటింగ్ విధానం ఎక్కడిదనీ, కొత్తగా ఓటింగ్ ప్రక్రియ ఏంటనీ ఎంఐఎం కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమ సభ్యులు నలుగురు మాత్రమే ఉన్నప్పుడు ఓటింగ్ పెట్టి ఎవరిని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ మేయర్‌పై మండిపడ్డారు.
మీరేలా ఓటింగ్ పెడతారో చూస్తామంటూ తేల్చి చెప్పడంతో… అజెండా నుంచి చెరువుల పరిరక్షణ అంశాన్నీ తొలగించి సమావేశాన్ని నిర్వహించారు. వివాదం కాస్తా సద్దుమణగడంతో సమావేశంలో ఇతర అంశాలకు ఆమోదం తెలుపుతూ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఎల్బీనగర్ హయత్ నగర్ కార్పొరేటర్ ప్రోటోకాల్ వివాదం, ఎస్సీ, ఎస్టీ కేసు అంశంలో సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ వివాదంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌ను మందలించారు. అభివృద్ధి పనుల విషయంలో స్థానిక కార్పొరేటర్‌కు కచ్ఛితంగా సమాచారం ఉండాలన్నారు. ఇదేవిషయంలో తరుచుగా ప్రోటోకాల్ వివాదాలు వస్తున్నాయని, అధికారుల తీరు మార్చుకోవాల్సిందే మేయర్ స్పష్టం చేశారు.