మైలార్‌దేవ్‌పల్లి, సెప్టెంబర్ 23: రూ.9లక్షల సుపారీ తీసుకొని ఒక వ్యక్తి హత్యకు పన్నిన కుట్రను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ నరేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం& వట్టెపల్లికి చెందిన ఇమ్రాన్‌ఖాన్ గతంలో యాసిన్ఖాన్తో కలిసి పాత వాహనాల అమ్మకం, కొనుగోలు వ్యాపారం చేసేవారు. అయితే వారి వ్యాపార లావాదేవీల్లో గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.
ఈ గొడవల్లో భాగంగా ఏడాది క్రితం ఇమ్రాన్‌ఖాన్‌ను చంపాలనే ఉద్దేశంతో షేక్ అమీర్, మహ్మద్ సోహెల్ మరికొందరు వ్యక్తులతో కలిసి యాసిన్‌ఖాన్.. అతని ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనపై ఇమ్రాన్‌ఖాన్ ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి షేక్ అమీర్, మహ్మద్ సోహెల్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే యాసిన్‌ఖాన్ తనను చంపాలని చూస్తున్నాడని భావించిన ఇమ్రాన్‌ఖాన్.. తానే యాసిన్‌ను లేపేయాలని నిశ్చయించుకున్నాడు.
దీంతో తనకు తెలిసిన ఇబ్రహీం, సైప్, శ్రీరామ్ (హోంగార్డు), షాబాద్, షోయబ్, బావజీర్లను ఈ నెల 21వ తేదీన బార్కస్‌లోని సాలాల వద్దగల బొందలగడ్డ వద్దకు పిలిచి విషయం చెప్పాడు. యాసిన్ఖాన్ను చంపితే రూ.9 లక్షలు ఇస్తానని సుపారీ మాట్లాడి, అడ్వాన్స్‌గా రూ.60 వేలు, నాలుగు కత్తులు ఇచ్చాడు. అయితే ఈ నెల 22వ తేదీన యాసిన్‌ఖాన్ వట్టెపల్లిలోని నైస్ హోట్కు వస్తాడని తెలుసుకున్న సుపారీ గ్యాంగ్ ఆరోజు రాత్రి 7.30 గంటల సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చి మాటువేశారు.
దీనిని ముందుగానే పసిగట్టిన పోలీసులు వారిపై నిఘా పెట్టి పట్టుకునేందుకు ప్రయత్నించగా, అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. ఈ సమయంలో వట్టెపల్లికి చెందిన మహ్మద్ సైఫ్(21), ఫలక్‌నూమా ఏసీపీ ఆఫీస్‌లో హోంగార్డుగా పని చేస్తున్న శ్రీరామ్(35)లను పోలీసులు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా సుపారీ ఇచ్చిన సూత్రదారి ఇమ్రాన్‌ఖాన్(43) గురించి విషయం బయటపడడంతో అతడిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురు నిందితులతోపాటు కత్తులు, రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లు, పది వేల నగదును స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కుట్రను చాకచక్యంగా భగ్నం చేసి, నిందితులను పట్టుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.పైడినాయుడు, విశ్వనాథ్‌రెడ్డి, పీసీలు వేణుగోపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వంశీకృష్ణ, ముక్తర్లను ఇన్స్పెక్టర్ నరేందర్ అభినందించారు.