మెహిదీపట్నం, డిసెంబర్ 6:సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో తాను పనిచేస్తున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ పనిమనిషిని శనివారం టోలిచౌకి పోలీసులు అరెస్ట్ చేసి 5 లక్షల రూపాయల విలువ చేసే నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు టోలిచౌకి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్,ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్,అదనపు ఇన్స్పెక్టర్ బాల్‌రాజ్ ,ఎస్ఐ సతీష్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు.
షేక్‌పేట్ మాగ్నస్ సత్వా అపార్టుమెంట్లో నివసించే రానా తబస్సుమ్ ఇంట్లో మాధురి అనూరాధ(39) పనిచేస్తోంది.ఇదిలా ఉండగా నాలుగో తేదీ రానా తబస్సుమ్ అల్మారాలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె భర్త ఇక్బాల్ అహ్మద్ టోలిచౌకి పోలీసులకు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును బట్టి విచారణ చేపట్టిన పోలీసులు శనివారం టోలిచౌకిలో మాధురి అనూరాధను పట్టుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
మరో కేసులో..
యజమాని ఇంట్లో నాలుగున్నర తులాల బంగారు,50 తులాల వెండి ఆభరణాలను దొంగిలించిన పనిమనిషిని,ఆమెకు సహకరించిన ఆటో డ్రైవర్‌ను టోలిచౌకి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారు,50 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్,ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్,అదనపు ఇన్స్పెక్టర్ బాల్‌రాజ్ ,ఎస్ఐ సతీష్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు.
ఎన్ఎస్ఎఫ్ కాలనీలో నివసించే ఫర్హీనా బేగం గత నెల 22 వ తేదీన మలక్‌పేట్‌లో తన తల్లి ఇంటికి వెళ్లింది. 24 వ తేదీన ఇంటికి తిరిగి వచ్చిన ఆమె ఇంట్లో ఆల్మారా తెరచి ఉండటం చూసి దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన టోలిచౌకి పోలీసులు శనివారం టోలిచౌకి మావా జ్వెల్లర్స్లో ఆభరణాలను ఆమ్మడానికి వచ్చిన రుహీనాబేగం(27),మహ్మద్ రజాక్(35)లను పట్టుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా ఫర్హీనా బేగం ఇంట్లో చేసిన దొంగతనం ఒప్పుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కేసు దర్యాప్తులో ఉంది.