బన్సీలాల్‌పేట్, నవంబర్ 8 : ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల రిపోర్టులు, ఫిల్మ్‌ల కోసం నిరీక్షించే అవసరం లేకుండా.. రోగుల చికిత్సలో జాప్యం నివారించడానికి ఇక నుంచి గాంధీ దవాఖానలో ఆన్లైన్లోనే రిపోర్టులను తక్షణమే పొందవచ్చు. ఇందుకోసం ‘పిక్చర్ ఆర్కైవింగ్ అండ్ కమ్యూనికేన్ సిస్టమ్’ (ప్యాక్స్) అనే సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. రేడియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ పి.శ్రీహరీతో కలిసి ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
ప్రమాదాలు, అత్యవసర వైద్య సేవల కోసం గాంధీ దవాఖానకు రోజు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, చికిత్సలో జాప్యం నివారించడానికి రేడియాలజీ విభాగం ఎమర్జన్సీ క్యాజువాలిటీ విభాగం, 60 బెడ్ల మెడికల్ ఐసీయూ, న్యూరాలజీ విభాగం, ఏఎంసీ, టీఎంటీ, సర్జరీ లాంటి అత్యవసర వైద్య సేవలు అందించే ముఖ్యమైన విభాగాలకు ల్యాన్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్ సిస్టమ్‌లను అనుసంధానం చేశామని వారు తెలిపారు. ఎక్స్-రే ఫిల్మ్‌లు, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ ఫిల్మ్‌లను కూడా యథావిధిగా ఇస్తామని, రిపోర్ట్‌లను కూడా యథావిధిగా రోగులకు అందజేస్తామని చెప్పారు.