సంచిత పాప వినాశన లింగం
వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ
నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్;ఉదయం నుంచే భక్తుల క్యూలైన్.. అభిషేకాలు, అర్చనలు, అన్నదానాలు ప్రభుత్వం తరుఫున పట్టువస్ర్తాల సమర్పణ.. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జాగరణ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు ఆధ్యాత్మికఝరిలో తడిసిముద్దయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ.. శంభో శంకర.. అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలైన వేములవాడ, ఏడుపాయలలో మంత్రులు ఐకేరెడ్డి, గంగుల కమలాకర్, హరీశ్‌రావు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. మహబూబాద్ కురవి వీరభద్రుడికి మంత్రి సత్యవతిరాథోడ్ బంగారుమీసాలు, భద్రకాళికి ముక్కుపుడకను అందజేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి రాజరాజేశ్వరస్వామికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కోడె మొక్కు చెల్లించుకోగా, పాలకుర్తి సోమేశ్వరాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సూర్యాపేట పిల్లలమర్రి శివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తిశ్రద్ధలతో త్రినేత్రుడిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం భక్తులు ఉపవాస దీక్షలు విరమించారు. జాగరణ దీక్షలో భాగంగా సంకీర్తనలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో అలరించాయి.