మారేడ్‌పల్లి/ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 9: కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లో మహంకాళి బోనాలు వైభవంగా జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల ఆట, పాటలతో సందడిగా సాగాయి. ఆదివారం తెల్లవారు జామున నుంచే మహిళలు బోనం నెత్తిన పెట్టుకొని అమ్మవారికి కల్లు సాక పోసి బోనం సమర్పించారు. మోండా డివిజన్ రెజిమెంటల్‌బజార్‌లోని గ ండి మైసమ్మ, జూలేశ్వరి దేవి, నల్ల పోచ మ్మ, తుల్కలమ్మ , సెకండ్‌బజార్‌లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, శివాజీనగర్‌లోని డొక్కలమ్మ, ఈదమ్మ మహంకాళి బైరవస్వామి, వైఎంసీఏ ప్రాంతంలోని రేణు కా ఎల్లమ్మ, ఆదయ్యనగర్‌లోని ఏడు గుళ్లు , పోచమ్మ, ఐదవ వార్డు మహాత్మాగాంధీ నగర్‌లోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గండిమైసమ్మ ఆలయం వద్ద వివిధ జిల్లాల కు చెందిన కళాకారుల జానపద, ఆట, పాటలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పలు ఆలయాల నార్త్ జోన్ పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.
ప్రముఖుల ప్రత్యేక పూజలు…
బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పలు ఆలయాల్లో పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెజిమెంటల్‌బజార్ లోని గండి మైసమ్మ ఆలయంలో మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎస్ఎంఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీ గణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గణేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు సభ్యులు పాండుయాదవ్, బీఆర్ఎస్ నాయకు లు ముప్పిడి మ ధుకర్లు పలువురు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బాబురావు, అల్లాడి గౌరీశంకర్, నందికంటి రవి, శ్రీనాథ్, నర్సింహను శాలువాతో సత్కరించారు.
ముత్యాలమ్మను దర్శించుకున్న డిప్యూటీ మేయర్
ఆషాఢ మాసం లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ టకారా బస్తీ ఘాస్మండిలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో కలిసి నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనితానాయక్ తదితరులు పాల్గొన్నారు.