హైదరాబాద్ : గత మూడు దశాబ్దాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో(Osmania University) పనిచేస్తున్న కాంట్రాక్ట్ బోధనేతర ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా తమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేక తెలంగాణలో మెరుగైన భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాం.
2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఉస్మానియా కాంట్రాక్ట్ బోధనేతర ఉద్యోగులకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికి క్రమబద్ధీకరణ చేయలేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారు. 20-25 సంవత్సరాలకు పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విశ్వవిద్యాలయ సేవలో ఉన్నా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే నాలుగు సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదు. కనీసం ఇప్పుడైనా తమ జీతాలు పెంచి తమను టైమ్ స్కేల్ ఉద్యోగులుగా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాన్ టీచింగ్ క్రాంటాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్ల అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కల అభిలాష్, ప్రధాన కార్యదర్శి ఎం రాము, వైస్ ప్రెసిడెంట్ జి రవిరెడ్డి, డాక్టర్ వీరేష్, ఏ సంతోష్, మెహర్, అనిత, సునీత, సౌమ్య, సుజాత మహేశ్వరి, మానస తదితరులు పాల్గొన్నారు.