Mahankali Bonalu | బేగంపేట, జూలై 21: శివసత్తుల సందడి, పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో లష్కర్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 3.30 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలిబోనం బోనం సమర్పించారు. ఉదయం 8.30 సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
దేవాదాయ శాఖ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు, బోనాలు సమర్పించే మహిళలకు రెండు క్యూలైన్లు, వీఐపీ కోసం ఒక క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. జలమండలి భక్తుల కోసం తాగునీటి వసతి కల్పించగా, జాతరను తిలకించేందుకు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలను పెట్టారు. బల్దియా సిబ్బంది, వివిధ విభాగాల వలంటీర్లు క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహాయ సహకారాలు అందించారు.

గోల్కొండ ఎల్లమ్మకు 5వ బోనం
మెహిదీపట్నం: గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆదివారం ఐదో బోనం పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు చేరుకొని అమ్మవారికి ఘనంగా బోనం, తొట్టెలు సమర్పించారు.
ముత్యాలమ్మ ఆలయంలో..
టకారబస్తీలోని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నివాసంలో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. పద్మారావుగౌడ్ స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోనాల వేడుకల్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీ సురభివాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బోనాలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో చూపరులను కనువిందు చేసింది. మహిళలు బోనమెత్తుకుని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాల్లో చిన్నాపెద్దలు సంతోషంగా గడిపారు.

