Hyderabad CP | సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): నాంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, అతనిపై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ వర్గాల మధ్య ఇటీవల చోటు చేసుకున్న వివాదాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో గురువారం బంజారాహిల్స్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించారు. హూమాయూన్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ కోర్టు ముందు రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ సమాచారాన్ని వివరించారు. నియోజకవర్గంలో ఇరువురి మధ్య ఆధిపత్యాన్ని సాధించేందుకు రాజకీయ పరంగా పోటీ ఉందని చెప్పారు.
ఈ నెల 7న ఫిరోజ్ గాంధీ నగర్లో సీసీ రోడ్డు పనులు తనిఖీ చేసేందుకు ఎంఐఎం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ మాజిద్ హుస్సేన్ అక్కడకు తన అనుచరులతో వచ్చాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్‌ఖాన్ కూడా తన అనుచరులతో రోడ్డు పనులు తనిఖీ చేసేందుకు అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా మాజిద్ హుస్సేన్ అనుచరులు సీసీ రోడ్డు పనులకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందన్నారు. ఆ ఘటనతో రెండు గ్రూపుల అనుచరలతో ప్రజల్లో భయాందోళనలు కల్గించడమే కాకుండా స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ఉన్నాయన్నారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరుపక్షాల కార్యకర్తలను చెదరగొట్టి, పరస్పరం వచ్చిన ఫిర్యాదులపై రెండు వర్గాలపై కేసు నమోదు చేశామన్నారు.
ఇరు వర్గాల ఆధిపత్య పోరుతో..
ఇరువర్గాల మధ్యనున్న ఆధిపత్య పోరుతో హూమాయూన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధితో పాటు పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇరువురిని కొంత కాలం పాటు నిర్బంధించాలని కోర్టును అభ్యర్థించాడు. దీంతో మాజిద్ హుస్సేన్‌తో పాటు అతని అనుచరులు 10 మంది, ఫిరోజ్‌ఖాన్ అతని తొమ్మిది మంది అనుచరులతో ఇరువర్గాలు కోర్టు ముందు హాజరై వాదనలు వినిపించారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్ అలాంటి రెచ్చగొట్టే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఇరువర్గాలకు సూచిస్తూ, కేసు విచారణను వాయిదా వేశారు. కాగా, సెక్షన్ 126 బీఎన్ఎస్ఎస్, 2023 (సెక్షన్ 107 సీఆర్పీసీ) ప్రకారం, వ్యక్తి లేదా సమూహాలలో ఒకరు, అంతకంటే ఎక్కువ మంది ఉండి ప్రశాంతతకు భంగం కల్గించే చర్యలకు పాల్పడే అవకాశం ఉంటే నిర్ణీత వ్యవధిలో శాంతిని నెలకొల్పడానికి ఇరువర్గాల నుంచి ప్రశాంతతను కాపాడుతామని ఎగ్జిక్యూటివ్ బాండ్‌ను ఇవ్వాలని ఆదేశించడం జరుగుతుంది.