హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఆరోగ్యం విషమంగానే ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గురువారం ఆయన ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు.
గోపీనాథ్‌కు కేటీఆర్ కుటుంబం అండ
ఛాతినొప్పితో స్పృహ కోల్పోయి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం అండగా నిలుస్తున్నది. మాగంటి అస్వస్థత విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ సతీమణి శైలిమ హుటాహుటిన గురువారం సాయంత్రమే దవాఖానకు చేరుకున్నారు. గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ భరోసానిస్తున్నారు. గోపీనాథ్ ఆరోగ్యపరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్న కేటీఆర్‌కు ఫోన్‌ద్వారా తెలియజేస్తున్నారు.