సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మీర్పేట్లోని దారుణ ఘటనలో భార్యను ముక్కలు చేసి ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్‌ను వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో కూర్చొని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడని ఒక అంచనాకు వచ్చారు. ఈ నెల 18న మీర్పేట్ ఠాణా పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో నివాసముండే పుట్ట వెంకట మాధవి మిస్సింగ్‌పై కేసు నమోదు అయ్యింది.
ఈ కేసు దర్యాప్తులో ఆమె భర్తే అతి కిరాతకంగా ఆమెను చంపి, శరీరాన్ని ముక్కలు చేసి వేడి నీటలో ఉడికించి, బొక్కలు పొడి చేసి బాత్రూమ్ ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి పంపించాడని వెల్లడైంది. ఈ ఘటనపై నిందితుడు గురుమూర్తి పోలీసులకు రోజుకో మాట చెబుతూ ఆధారాలు చిక్కకుండా ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించేందుకు హైదరాబాద్ క్లూస్ టీమ్ హెడ్, సైంటిస్ట్ వెంకన్న బృందం సహకారం అందిస్తున్నది. బ్లూ రే టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో నుంచి సేకరించిన ఆధారాలను మీర్‌పేట పోలీసులు విశ్లేషించారు.
సాంకేతికపరమైన ఆధారాలు, 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, కాల్స్‌తో పాటు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను సేకరించారు. సాంకేతికపరంగా సేకరించిన అంశాలు, నిందితుడు గురుమూర్తి చెప్పిన అంశాలను విశ్లేషించి.. మాధవిని గురుమూర్తి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని దొరక్కకుండా నిందితుడు ప్లాన్ చేసినట్లు ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇప్పటి వరకు మిస్సింగ్‌గా ఉన్న ఈ కేసును హత్య కేసుగా మార్చనున్నారు. హత్య కేసుగా మార్చిన తరువాత మరో సారి గురుమూర్తి ఇంట్లో సీన్ రికన్స్ట్రక్షన్ చేసి హత్య కేసులో పకడ్బందీ ఆధారాలను సేకరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్టు చేసే అవకాశాలున్నాయి.
గురుమూర్తి తన భార్యతో గొడవ పడి ఆమెను హత్య చేశాడు. హత్య తరువాత ఆమె మృతదేహం కన్పించకుండా చేస్తే తనను ఎవరూ పట్టుకోరనే భావనలో ఉన్నాడు. దీంతో తన ఇంట్లో ఉన్న కత్తులతోనే మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. మొదట చేతులు, ఆ తరువాత రెండు కాళ్లు నరికి వాటిని రెండు భాగాలుగా చేసి బకెట్లో వేశాడు. హీటర్‌ను ఆన్ చేసి ఆ వేడి నీటిలో వాటిని ఉడికించాడు. మాంసం, బొక్కలు వేరుగా అయ్యేందుకు త్వరగా ఉడికేలా పొటాషియం హైడ్రాక్సైడ్‌ను కూడా వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూమ్లోనే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. బాత్రూమ్ బయట పెయింట్ కోసం ఉపయోగించే 25 లీటర్ల డబ్బాలో హీటర్ వేసి అందులో నీటని వేడి చేసినట్లు ఆధారాలు సేకరించారు. ముక్కలు మొత్తం మెత్తగా చేసి వాటిని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశాడు.
అనంతరం బొక్కలను ఫంక్షన్ హాల్లో వంటలు చేసేందుకు ఉపయోగించే పెద్ద స్టౌపై కాల్చాడు. కాల్చిన బొక్కలను రోకలిపై వేసి దంచి, ఆ తరువాత వాటిని పొడి చేసి టాయిలెట్ ద్వారా డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే పోలీసులు పలు రకాలైన ఆధారాలను సేకరించి, హత్య జరిగిన విధానంపై విశ్లేషణ చేసి ఒక నిర్ధారణకు వచ్చారు. కేసులోని సెక్షన్లను మార్చి ఒకటి రెండు రోజుల్లో నిందితుడిని కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. కాగా ఈ ఘటనపై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నుంచి సహకారాన్ని తీసుకుంటున్నామని, ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని, ఈ సమయంలో అధికారంగా ఏ విషయం మేం చెప్పలేమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.