కేపీహెచ్బీ కాలనీ, మే 12 : కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పోరాటం చేయాలని.. దొంగ దీక్షలతో పబ్బం గడుపుతూ ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలని.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. కూకట్పల్లిలో బీజేపీ నేతలు డబుల్ బెడ్రూం ఇండ్లపై సీఎం కేసీఆర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని, ఇప్పటికే నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదన్నారు. కొత్త రాష్ర్టానికి కేంద్రం నుంచి పథకాలకు గానీ, ప్రాజెక్టులకు గానీ నిధులు ఇవ్వకపోగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, ప్రాజెక్టులను విమర్శించడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నేతలు, పార్టీ ద్వంద్వ విధానాలను తెలంగాణ ప్రభుత్వం గమనిస్తుందన్న విషయం గుర్తించుకోవాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలోని పథకాలు గానీ, ప్రాజెక్టులు గానీ ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కూకట్పల్లిలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ భూములను కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను ఒప్పించి.. పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆ స్థలాన్ని కేటాయించేలా ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోరాడాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యమని స్పష్టం చేశారు.