కూకట్పల్లి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును (Madhavaram Krishna Rao) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే ఆయన నివాసానికి చేరుకున్న భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ డివిజన్లో హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తున్న నేపథ్యంలో వారిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వారి నివాసాలకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. వేలంలో పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలానికి వెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. స్థలాలు కొనేందుకు ఇప్పటికే డీడీలు కూడా తీసున్నామని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడకుండా అడ్డుకుంటున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ భూములు అమ్మేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడంపై కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాలను ప్రభుత్వం తరఫున వేలం వేయడమేంటని ప్రశ్నించారు.