సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల తీరును ఎండగడుతూ ఎమ్మెల్యే కృష్ణారావు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పర్మిషన్ ఉన్నా కూడా ఒక్కో బిల్డింగ్‌కు రూ.35 లక్షలు వసూలు చేస్తున్నారంటూ అడిషనల్ సీసీపీ గంగాధర్‌ను కలిసి వివరించారు. అధికారులు ఒక్కో దగ్గర ఒక్కో విధానంలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అయ్యప్ప సొసైటీ, గోకుల్‌ప్లాట్స్, హఫీజ్‌పేట్, శేరిలింగంపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా ఐదు నుంచి తొమ్మిది ఫ్లోర్ల వరకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారని, వాటిపై ఎలాంటి ఆంక్షలు లేవని వివరించారు. సామాన్య ప్రజలు సొంతింటి నిర్మాణంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు.
కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 10: కూకట్పల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ అధికారులు అసమగ్ర విధానాలతో భవన నిర్మాణదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అక్రమ నిర్మాణాలను సీజ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరి కాదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్, అడిషనల్ సీసీపీ కూకట్పల్లి జోనల్ అధికారుల దృష్టికి భవన నిర్మాణదారుల సమస్యలను తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. నియోజకవర్గం లో 50 కి పైగా భవనాలను సీజ్ చేయడం బాధాకరమని, ఎక్కడ లేని విధంగా కూకట్‌పల్లిలోనే అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం సరికాదన్నారు. అధికారులు డబ్బులు తీసుకొని కూడా భవనాలను సీజ్ చేస్తున్నారని వసూళ్ల కోసం టీంలను ఏర్పాటు చేసుకొని నిర్మాణదారులను ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అధికారుల తీరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న లీడర్లు నకిలీ మీడియా ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.