శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 : ఆస్తి కోసం బామ్మర్దిని కడతేర్చాడు బావ. బామ్మర్దిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని ప్రణాళిక రచించాడు. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి మరో ఇద్దరితో కలిసి బామ్మర్దిని గొంతునులిమి హత్యచేయించి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న అత్తింటివారిని నమ్మించి మృతదేహాన్ని ఖననం చేయించి అంత్యక్రియలు చేయించాడు. అత్తింటివారు తమ కొడుకు మృతిపై అనుమానాలున్నాయని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు హత్యకేసును ఛేదించి ప్రధాన నిందితుడు అల్లుడుతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం మాదాపూర్ ఎసీపీ శ్రీకాంత్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, నెల్లూర్ జిల్లా, కావలి జనతాపేట ప్రాంతానికి చెందిన మద్దసాని ప్రకాశం వ్యాపారవేత్త. కావలిలో బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ప్రకాశంకు కుమార్తె అమూల్య, కుమారుడు యశ్వంత్ సంతానం. 2017లో కూతురు అమూల్యకు నెల్లూరు జిల్లా అగ్రహారానికి చెందిన గోగుల శ్రీకాంత్‌తో వివాహం అయింది. శ్రీకాంత్ నగరంలోని కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో నివాసం ఉంటూ గచ్చిబౌలి జయభేరి ఎన్‌క్లేవ్‌లో బాలాజీ వర్కింగ్ మెన్స్హాస్టల్ నిర్వహిస్తున్నాడు.
గత ఐదేండ్లుగా అక్క, బావలతో ఉంటున్న మద్దపాని యశ్వంత్ నగరంలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా శ్రీకాంత్ భార్య అమూల్య గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది. బావ శ్రీకాంత్, బామ్మర్ది యశ్వంత్ మాత్రమే ఉంటున్నారు. హాస్టల్ నిర్వహిస్తున్న శ్రీకాంత్ ఆన్లైన్లో కోడిపందాలు, బెట్టింగ్‌లు కాస్తూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అదనంగా అప్పుల ఊబీలో చిక్కుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో అత్తింటి ఆస్తిపై కన్నేశాడు. ఎలాగైనా తన బామ్మర్దిని అడ్డు తొలగిస్తే ఆస్తి తన సొంత మవుతుందని భావించి కుట్ర పన్నాడు.
శ్రీకాంత్ హాస్టల్లో వంటమనిషిగా పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం.. కరావర్ జిల్లాకు చెందిన పులిశ్రామని ఆనంద్(35)తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్సుగా రూ. 2లక్షలు చెల్లించాడు. తన బామ్మర్ది యశ్వంత్‌ను అడ్డు తొలగించాలని ప్రణాళిక రచించారు. యశ్వంత్‌ను హత్యచేసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అందర్ని నమ్మించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆనంద్ తన స్నేహితుడు అంబటి వెంకటేశ్(23) సహాయం కోరాడు. కాగా ఈనెల 2న రాత్రి హాస్టల్లో ఉన్న యశ్వంత్ మెడకు గొంతునులిమి హత్యచేశారు.
అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకొని యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు చున్నీతో బిగించి చిత్రీకరించారు. పథకంలో భాగంగా హాస్టల్ సీసీ కెమెరాలు మూడు రోజుల ముందే తొలగించారు. రాత్రికిరాత్రే అత్తింటివారికి ఫోన్ చేసి యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులకు తెలిస్తే పోస్టుమార్టం చేస్తారని, హాస్టల్‌పై కేసు అవుతుందని నమ్మించి గుట్టుచప్పుడు కాకుండా కారులో యశ్వంత్ మృతదేహాన్ని అత్తింటికి తీసుకెళ్లాడు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు వెళ్లాక అంబులెన్సు తీసుకొని మృతదేహం తరలించాడు.
అత్తింటివారు అంత్యక్రియలు వెంటనే చేయాలని, ఆత్మహత్య కాబట్టి పూడ్చిపెడితే ఇబ్బంది అవుతుందని ఖననం చేయాలని ఒప్పించి ఈ నెల 3వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. అల్లుడి హడావిడి, కదలికలపై మృతుడు యశ్వంత్ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో కొద్ది రోజులకు నగరానికి చేరుకుని హాస్టల్లో విచారించి పరిశీలిస్తే యశ్వంత్ మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు 10వ తేదీన ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతుడి బావ శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడు గోగుల శ్రీకాంత్‌తో పాటు అతడి నుంచి సుపారీ తీసుకొని యశ్వంత్‌ను హత్యచేసిన ఆనంద్, వెంకటేశ్‌లను పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.90 వేల నగదు, 4 సెల్ఫోన్లు, ఓ చున్నీ, మారుతీ బ్రీజాకారును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన గచ్చిబౌలి డిటెక్టివ్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శోభన్ బాబులను ఈ సందర్భంగా ఏసీపీ అభినందించారు.