తెలుగు యూనివర్సిటీ, మే 30 : పుస్తక పఠనంతో పాటు సామాజిక వికాసానికి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని విద్యాపరిశోధన, శిక్షణమండలి సంచాలకురాలు ఎం. రాధారెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో కొనసాగుతున్న బాలల సాహిత్య సమ్మేళనం ముగింపు సభలో పాల్గొన్న రాధారెడ్డి ప్రసంగించారు. బాల్యదశలోనే చిన్నారుల్లో మాతృభాష పట్ల మమకారంతో పాటు ఉత్తమ గుణాలను అలవర్చుకునేలా చూడాలన్నారు.
పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రసంగిస్తూ.. బాల సాహిత్య రంగంలో ఉత్తమ గ్రంథానికి ఇరవై వేల రూపాయల నగదు పురస్కారాన్ని వచ్చే ఏడాది నుంచి అందజేస్తామన్నారు. బాలల వ్యక్తిత్వ వికాసం కోసం పరిషత్తు చేస్తున్న కృషిని మోడల్ స్కూల్స్ విభాగం సంయుక్త సంచాలకురాలు పాలడుగు సరోజినీదేవి కొనియాడారు. కార్యక్రమంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్ పాల్గొన్నారు.