Hyderabad Metro | సిటీబ్యూరో, ఏప్రిల్ 17 ( నమస్తే తెలంగాణ ) : ఇకపై హైదరాబాద్ మెట్రో ప్రయాణం భారం కానున్నది. టికెట్ ధరలు పెంచడానికి ఎల్అండ్టీ సిద్ధమైంది. ఇప్పటికే టికెట్ కనిష్ఠ ధర రూ.10 గరిష్ఠ ధర రూ.60 ఉండగా అదనంగా ధరలు పెంచడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. రోజుకు 5.10 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నప్పటికీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.
అందులో భాగంగా ఎల్అండ్టీ అధికారులు టికెట్ ధరల పెంపుపై చర్చిస్తున్నారు. ఎంత పెంచాలి? ఒకేసారి పెంచాలా లేదా విడతల వారీగా పెంచాలా? తదితర వాటిపై విస్త్రృతంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డును ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు మెట్రో కార్డుపై రద్దీవేళల్లో 10 శాతం రాయితీని సైతం విరమించుకున్నారు. ఇప్పటికే ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయితీలు ఎత్తేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి క్రమంలో మెట్రో టికెట్ ధరలు పెంచితే ప్రయాణికులు ఎలా స్పందిస్తారో చూడాలి.
కరోనా విపత్కర సమయాల్లో తీవ్రంగా నష్టపోయామని టికెట్ ధరలు పెంచడానికి అనుమతినివ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని 2022లో కోరిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి.. చార్జీలను సవరించాలని ప్రతిపాదించింది. కానీ ప్రయాణికులపై భారం మోపడం సరైనది కాదని.. అప్పటికీ కొవిడ్ ప్రభావం కొనసాగుతున్న దరమిలా కేసీఆర్.. మెట్రో అధికారుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. కాగా, ప్రస్తుతం వరకు మెట్రో రైలు నష్టాలు రూ.6,500 కోట్లకు చేరాయని అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆదాయ మార్గాలను మెరుగుపరచుకున్నా.. నష్టం కొనసాగుతుందని వివరించారు. అందులో భాగంగా మెట్రో ధరల పెంపుకు రంగం సిద్ధమైనట్టు అధికారులు చెబుతున్నారు.